Saturday, 3 July 2021

Annam parabrahma swaroopam

  అన్నం పరబ్రహ్మ స్వరూపం 


మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం . సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలతో కళ కళలాడే ఆవరణం . నాకు అప్పుడు ఇరవై యొక్క ఏళ్ల వయస్సు . అక్కడ టీచర్ ట్రైనింగ్ (బి. ఎడ్ ) చేస్తున్నాను . యూనివర్సిటి కాంటీన్ చాలా బావుండేది, సుమారు ముప్పై ఏళ్ల క్రిందటి మాట ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఎక్కువగా తమిళ వంట వాళ్ళు ఉండే వాళ్ళు .ప్రొద్దున్నే మూడు గంటలకంతా  స్నానాలుచేసి నామాలు దిద్దుకుని మడిగా శుచిగా వంట చేయడం మొదలు పెట్టేవాళ్ళు.  కాంటీన్ కూడా చాలా శుభ్రంగా ఉండేది. 

ప్రతి టేబుల్ మీద చిన్న చిన్న స్టీల్ బకెట్స్ లో సాంబారు చారు లాంటివి ఉంచేవారు. కౌంటర్ దగ్గరికి కంచం తీసుకువెళ్లితే అన్నం , చేతి పచ్చడి , చిన్న గిన్నెలో పెరుగు ఒక కూర ఒకసారి వడ్డించేవాళ్ళు . ఆ తరువాత చారో సాంబారో వేసుకునే వాళ్ళం . కూరలు ఎక్కువగా చెనగపప్పు కాయగూరలతో కలిపి వండే వాళ్ళు . బీట్రూట్ చెనగపప్పు , కేరట్ చెనగపప్పు అలా. రాయలసీమ కదా ఆ ప్రాంతం వంటలు ఉండటం మామూలే . 

మా రూమ్మేట్ తనతో బాటు నాకు కూడా కంచాలలో అన్నం కూరలు పట్టుకొచ్చింది . చాలా ఎక్కువ పెట్టుకొచ్చేసింది . ఇంతేంటి అంటే మళ్ళీ మళ్ళీ ఏం  వెళతాం అంది. అన్నం  ఇంకా కావాలంటే మాత్రం  కౌంటర్ దగ్గరికి మళ్ళీ వెళ్లి వేయించుకోవాలి. అందుకే ఒకేసారి అలా తెచ్చేసుకునే వాళ్ళు . 

 ఆ రోజు నా కంచంలో అన్నం మిగిలిపోయింది . అందరు చేతులు కడుక్కునే  దగ్గర ( వాష్ ఏరియ ) మిగిలిన అన్నం అంతా ఒక పెద్ద డ్రమ్ లో వేసేవాళ్ళు . రెండు మూడు అలాంటివి ఉండేవి.  రోజూ అవి  నిండిపోతుండేవి  . మిగిలిన అన్నాన్ని నేను కూడా ఒకదానిలో  వేసి కంచం కడుక్కుంటున్నాను .  

ఇంతలో ఎంత అవసరమో అంతే వేసుకోవచ్చు కదా .అంటూ ఓ స్వరం వినిపిస్తే ఎవరబ్బా అని చూసాను . మా యూనివర్సిటీ స్టూడెంట్స్ లీడర్  థర్డ్ ఇయర్ న్యాయ శాస్త్రము (LLB )   చదువుతుంది. చేయక చేయక తప్పు చేసిన దానిలా మొహం పెట్టి సారీ అక్క అన్నాను . నాకు సారీ చెప్పి ఏం లాభం అటు చూడు వేస్ట్ బిన్స్  చూపిస్తూ రోజూ ఎంత వేస్ట్ చేస్తున్నారో ఇంకోసారి అలా  చేయకు అంది . తను అన్నది నిజమే అనిపించి సరే అక్క అన్నాను కానీ భయం కూడా వేసింది కొంప దీసి రేపటి నుండి  అన్నం కూడా కూరల్లా కొంచెం కొంచెం వేయిస్తుందేమో అని .  

కాంటీన్ బయటికి వచ్చాను బయట ఒకతను వేస్ట్ బిన్లో అన్నం అంతా ఒక గోనె సంచిలో వేసుకుని తన సైకిల్ కి   ఆ సంచి కట్టుకుంటున్నాడు. అదేంటి వొట్టి తెల్ల అన్నం ఏం చేస్తాడు అనుకుని ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు అని అడిగాను. దగ్గరలో గోశాల ఉంది ఆవుల కోసం అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగానే ఒక అతను వచ్చి ఆ  సైకిల్ దగ్గర నిలబడ్డాడు . ఇతను గోనె సంచిలో నుంచి చేతితో   మూడుసార్లు అన్నం తీసి ఆ వచ్చిన మనిషి ఇచ్చిన బట్ట సంచిలో వేసి ఇచ్చాడు. వారిద్దరి మధ్య మాటలేం లేవు . అతను వెళ్ళిపోయాడు. 

రోజూ వచ్చి తన ఆకలి కోసం తీసుకు వెళ్తుంటాడు అన్నాడు . ఆ మనిషిని చూస్తే బిచ్చగాడిలా లేడు . తిరుపతి లో చాలా రకాల మనుషులు ఉంటారు భక్తులు , సాధువులు , సాధకులు , బిచ్చగాళ్ళు , పిచ్చివాళ్ళు ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు దేశ దిమ్మరులు , వెంకన్న స్వామి  తప్పు చేస్తే ఒప్పుకోడు అనే మంచివాళ్ళు ఉంటారు . అప్పటి తిరుపతి వేరు కానీ ఇప్పుడు అంతటా మోసపూరిత దోపిడీ వ్యవస్థే కదా. 

ఎవరో అతను కానీ మేము వ్యర్థమని పడేసిన అన్నము అలా గోవులకి పెట్టడమే నాకు నచ్చలేదు అలాంటిది ఆ వ్యక్తి అలా తినడానికి తీసుకు వెళ్లడం నాకు కడుపులో తిప్పేసింది . చాలా రోజుల వరకు మర్చిపోలేక పోయాను . ఇప్పటికీ ఆ సంఘటన నా కళ్ళకి కట్టినట్లు గుర్తుందంటే  ఆ ఘటన నా అచేతనను  ఎంత ప్రభావితం చేసిందో అర్థం అవుతుంది . ఆ రోజు నుంచి తినే పదార్థాలు పడేయడం అంటే నా మీద నాకే కోపం అసహ్యం , జుగుప్స , పడేసేవాళ్ళ మీద ఇర్రిటేషన్. 

ఒకసారి ఆలోచించండి ఆ మనిషి స్థానం లో మనమే ఉండాల్సి వస్తే ఆ అన్నమే తినాల్సి వస్తే ! భగవంతుడా ! మా నాన్నగారు అంటూ ఉండే వారు "వేస్ట్ నాట్ వాంట్ నాట్ " అని.  

NEVER  EVER WASTE  FOOD అని ఎప్పుడు అందరం నిశ్చయించుకుంటామో ! 

చాలా మంది తమ ఇంట్లో వాళ్లకి డబ్బు వేస్ట్ చేయొద్దు అని  చెపుతుంటారు . రంగు కాగితాల కన్నా అన్నం విలువైంది అని " అన్నం పరబ్రహ్మ స్వరూపమని " ఎప్పుడు గుర్తిస్తాడో         మానవమాత్రుడు !


Tuesday, 20 September 2016

                                                           నాకు నచ్చిన మరో కవిత 
                                                                    సన్నికర్ష  
నిన్ను ప్రేమిస్తున్నానంటూ 
ఉద్వేగంగా ప్రకటించినప్పుడు 
పెద్ద తప్పు చేస్తున్నానని తోచలేదు 
ఏం తెలిసింది ప్రేమంటే ?

లలితంగా అవయవాల 
సున్నితమైన కదలికలు,
కనుచూపులు, పెదవి  విరుపులు,
హావభావాల అసందర్భ ఆరాటాలు,
తారుణ్యం తొణికే లావణ్యాల మబ్బులు , 
నీల నిర్వేద సముద్రపుటలల 
అవ్యక్త పరిమళాలు ........ 
అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లో నుంచి 
ఊడిపడ్డ గందరగోళపు 
ఇంద్రజాల స్వప్నాన్ని అనుభవించి,
'గాబరాని' ఆబగా  వరించి, 
ప్రేమ అని పొరపడ్డానా ? -

తల్చుకుంటే చిత్రంగా ఉంటుంది . 

ప్రేమ ఘట్టాల్లో అవిరామంగా ప్రయాణిస్తూ 
అద్భుత దృశ్యాలు చూసే అనుభవంలో , 
తెలియకుండా కాలం గడుస్తుండగా ...  

 ఏదో ఒక నిర్లిప్త సందర్భం 

హేమంత ఉషోదయ కాంతిలో 
పొగమంచు మబ్బులను చెదరగొట్టి , 
ఇవతలివైపు వాస్తవంలోకి తోసేసి -
నన్ను ఏకాంతంగా నిలబెట్టినప్పుడు.... 


వయస్సు టక్కరి తనంలో 

నిరంతరం కూడికలు , తీసివేతలు,
బతుకును పట్టుకు వేలాడుతున్నప్పుడు ,  
సుదూరాలకి ఎగిరిపోయే 
ప్రేమ - రెక్కల చప్పుడు.... విన్నాను.  


తెలిసిపోయే నిజం 

ఎప్పుడూ  బాధగానే ఉంటుంది. 
నువ్వొక నిత్యావసరానివి - అంతే. 
నేనొక దేశవాళీ మగమనిషిని . 


ఇద్దరిలో 

నిజం ఎవరికి ముందు తెలుస్తుందో 
ఉత్కంఠ - అదే !!
స్వప్నం, ఒక  అసంబద్ద వ్యాపకంగా 
పరిణమించడమే దాని తత్వ రహస్యం. 
ఒకా నొక సుఖ స్వప్న హేమంతం లోంచి 
బయటకు వచ్చి నిలబడ్డాను ,
తీర్మాన వాక్యం లాగ !

                                                         -   ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ 


Monday, 18 June 2012

Samaadhi lo o puvvu

                                                 నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు  రోజూ  నేను నా ఫ్రెండ్ అనురాధ ఒక ఖాళీ  స్థలంలో నుంచి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. ఒక సారి ముందు రోజు రాత్రి వానపడి నేల తడిసి ముద్ద అయ్యింది . కొన్ని చోట్ల నీళ్ళతో నిండిన చిన్న చిన్న గుంటలు. ఒక పెద్ద నీళ్ళ గుంట దగ్గర ముగ్గురు పిల్లలు నిలబడి ఏదో తిలకిస్తున్నారు . మేము కూడా కుతూ హలంతో  దగ్గరికి వెళ్లి తొంగి చూసాము . ఓ ప్రాణం లేని పసిగుడ్డు తేలుతూ ఉంది, ఆ తెల్లవారే పుట్టిందో ఏమో తెలియదు . అంత పసిగుడ్డుని చూడడం అదే  మొదటిసారి . ఇప్పటికి గుర్తుకు వచ్చినా  ఆ పసిగుడ్డు కళ్ళలో మెదులుతుంది . నాకు చాలా వింతగా , ఆశ్చర్యంగా అనిపించింది. ఆ శిశువుకి ప్రాణం లేదని నా ఫ్రెండ్ చెబితేనే తెలిసింది.

                                                    ఆ బిడ్డ తల్లి గురించి, ప్రవర్తన గురించి ఆ వయస్సులో  నా ఫ్రెండ్ చెబుతుంటే అర్ధం అయి అర్ధం కాని విషయాలు ఎన్నో నాకే  సమాధానం తెలియని, దొరకని ప్రశ్నలు మెదిలాయి అందులో తల్లి అలా బిడ్డను ఎలా ఒదిలేసిందని  ఒకటి .


                                                   ఆ విషయం మర్చిపోయాననుకున్నాను . కాని ఇన్నాళ్ళ  తరువాత పునరావృత్తం అయిన జ్ఞాపకాలలో ఆ ఘటన గమనిస్తే  ఏ పరిస్థితులలో ఆ కుటుంబం ఆ తల్లి  ఆ పని చేసారో కదా అనిపించింది. ఆ చిన్ని శరీరానికి చిన్న స్థలం ఒక అడుగున్నర స్థలం ఇవ్వలేని ఈ విశాల మానవ సమాజం , ఆ పసిగుడ్డుని అక్కున చేర్చుకునే అవకాశం అవనికి అందకపోవడం ఎవరి దురదృష్టమో. ఓ ప్రాణికి కేవలం ఓ సమాధి ఓ పువ్వు కూడా ప్రాప్తించని సహా ఉన్నత ఆధునిక సాంఘీక వ్యవస్థ లో ఐశ్వర్యమంతా  నిరుపయోగమే కదా?
         

Saturday, 12 November 2011

Chakkati Kavitha

నేను భద్రపరచుకున్నమరో  చక్కటి కవిత . ఎవరు లిఖి౦చారో  నోట్ చేసుకోలేదు. అందుకు క్షమార్హురాలిని.    
       
               
                                       


                                     పరిచయం  


నింగి నుండి నేల జారే ఓ అమాయకపు వర్షపు బిందువు 
కేవలం ఒక సముద్రపు గవ్వ పరిచయంతో స్వాతిముత్యం అవుతుంటే 
  
ఆదమరచి నిద్రపోతూ కలలుగనే ఓ కమలం కేవలం ప్రభాత వేల 
లేత కిరణాల తాకిడికే పులకిత అయి కళ్ళు తెరచి చూస్తుంటే  


గ్రీష్మ తాపానికి మొడుపోయిన చెట్లను చూచి మూగవోయిన ఓ కోయిల  
కేవలం ఓ మావిచిగురు కమ్మదనం కంఠ౦ తాకగానే గళమెత్తి              
మధురంగా పాడుతుంటే  


ఉదయం నుండి ఎండవేడిమికి అలసిపోయిన  ఓ కలువబాల 
కేవలం నెలరాజు కురిపించే వెన్నెల పుప్పొడి జల్లు స్పర్శచేతనే 
ఇంతింత కళ్ళతో ఆ జాబిలినే రెప్పవాలక చూస్తుంటే


ఇన్నిన్ని అందాలు సృష్టినుంటే 


 నీ  కోసం అన్వేషించే నా చూపు,  నీ  కోసం నిరీక్షించే నా కళ్ళు ,
చివరకు నా చిరునవ్వు , నా  పలకరి౦పూ,
ఏదీ నీలో స్పందన కలిగించలేనందుకు 
కారణం ఏమిటా అని ఆలోచిస్తే 
శూన్య౦ నన్నుచూసి వెక్కిరిస్తూ నవ్వింది 


మన పరిచయం ఏ అద్బుతమునకు దారి తీయలేదు 
           ఏ అందమును సృష్టించలేదు 



దురదృష్టం నాదే అనుకుందామంటే 
 అంతరాత్మ  అంగీకరించదు 
ఆ దురదృష్టం నీదే అనుకుందామన్నా 
తిరిగి ఆ అంతరాత్మ నన్నే నిలదీస్తుంది 
దేన్ని అంగీకరించలేని సందిగ్ధావస్థలో నేనుంటే 
చివరకు కన్నీరు కూడా మౌనంగా నా నుంచి 
      సెలవు తీసుకుంటుంది     

Monday, 7 November 2011

Maro Kavitha

 నేను గతంలో చదివి భద్రపరచుకున్న మరో కవితాచిత్రం 

                           నేను - నువ్వు 
                         
     ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు  
మేమిద్దరం చెరోదృవం వైపు విసిరేయబడతాము 
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది 
చేయి చాచితే అందే ఆమె దూరం 
మనస్సులో యోజనాలై విస్తరించుకుంటుంది 

ఉల్లిపొరై మా మధ్య లేచిన భేదభావానికి 
నా అహం ఉక్కు పూత పూసేందుకు  నడుం బిగిస్తుంది 
మౌనంగా  మా మధ్య చెలియలి కట్టలా పడుకుని ఉన్న పాపకు  
ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగసిపడుతుంది 
నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకుంటూ 
ఆమె కత్తి  వాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది 

  టైమ్ కి  డ్యూటీకి కొచ్చి తట్టి సైగ చేసే నిద్రను 
మెలకువ కసురుకొంటు౦ది  
  ఎ౦తకూ నిద్రలేవని ఆమెలో దాసిత్వాన్ని 
  నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది 
  అప్పుడు అభిప్రాయం కాదు సమస్య 
 అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం 

   ఇప్పుడు - భేద భావం కాదు ప్రశ్న 
    ఆమె అబలత్వం తీవై సాగి 
    చివురుల అరచేతుల్తో నా అహాన్ని స"మర్ధిస్తూ  " 
                        నా పైకి ఎగబాకలేదనే 
    క్షణ క్షణానికి ఆమె మౌనం 
                        మీద వేయించబడుతోన్న 
                                                     నా అహం  
   బేలగా మారి బీటలు వారెందుకు సిద్ధమౌతుంది 
 ఆమె చలిగాలి అలై ఒంటరితనాన్ని స్పర్శిస్తే  
    జలదరించి వర్షించాలని ఉంటుంది 

       మనో గవాక్షాల నుంచి దూకి వచ్చిన చంద్రబింబం 
     కన్నీటి బిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు 
       ఆమె లోని మాతృత్వం పాపకేసి నదిలా కదలి
     అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా 
           నేనే నీటి బుడగనై  పేలిపోతాను 
      ఎర్రనీటి  ఏటినై ఉరకలెత్తుతాను 
           ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను 
       నేనే ఆమెనై  అబలనై పసిపాపనై గారాలు పోతాను 

                                                          సన్నపురెడ్డి   వెంకటరామిరెడ్డి            
     
       



             

Sunday, 6 November 2011

O kavitha

         ఎప్పుడు  చదివానో గుర్తులేదు, ఎందులో చదివానో గుర్తులేదు కాని అర్థం అయి అర్థం కాని వయస్సులో ఈ కవిత ఎందుకో తెలియదు నాకు చాలా నచ్చింది . వ్రాసిన వారి పేరు తప్ప ఏమి తెలియవు కాని తన ఆర్తిని  మనస్సుకి హత్తుకునేలా  చాలా బాగా రచించాడనిపించింది . అందమైన సరళ  పదాలలో సంక్షిప్తంగా సంపూర్ణ దృశ్యంలో తన బాధని వ్యక్తీకరించాడు. ఇన్నాళ్ళు   ఎంతో అపురూపంగా వ్రాసుకుని మరీ పదిలంగా  దాచుకున్నాను. అది  మీ అందరితో పంచుకోవడం కోసం  ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.


                                                          జీవరసాయనం

            జత కోసం కరువ్వాచి  కలసినప్పుడల్లా  
                  త్వమేవాహం  వెఱెక్కించి 
             నన్ను పారేస్తున్నావు : నిన్ను పట్టుకెళ్తున్నావు 
                   చుట్టూ  సూన్యం 
              నన్ను నాకిచ్చెయ్యమంటూ  వినపడని కేక 
                 దీనంగా విన్నపంగా ------------ 
                         అలసి మౌనం   

               నేస్తం తాపాన్ని కాదు హాయినివ్వు 
           చీకటి లోయలోకి గెంటకు 
                  వెలుగు శిఖరంపై నిలుపు 

               జట్టుగా వెలుగు నీడలలో 
                         పయనిస్తున్న వేళ 
            నన్ను ఒంటరిని చేసి నీవు ఒంటరివి కాకు 

            
            ఎండమావుల లోకమంతా తిరిగి తిరిగి వస్తే 
                  చిరనిరీక్షణలో దుర్భరమైన ఏకాకితనం 
             సర్వస్వాన్ని హరి౦చిన తరువాత     
                   సజీవ  శిథిలే౦ద్రియాలు
              పలకాలనుకున్న స్వాగతం 
                   గ్రహించే శక్తి నీకు 
             పలికే శక్తి నాకు 
                     కరువు కాక ముందే గ్రహించు 


              చెలిమంటే  పరిహాసమూ   
                 దాగుడు మూతా 
              పిడికిలి బిగి౦పూ             
                 శాసనమూ కాదని                                                   
               
               
              చెలిమంటే   
           వ్రతమని, తపస్సని              
             దివ్యానుభవమని 


              మనిషినీ మనసునూ 
            నిత్య  యౌవ్వనంలో 
              హాయిగా...........  తాజాగా  నిలిపే  
             జీవరసాయనమని 
                                                                 -  కొమ్మన  రాధా కృష్ణ    
             
                                                                                                                           
                                                       








                                                                     
               
                      

            
                          

O Mudita Vinnapam

         
                ప్రియమైన  శ్రీ వారికి, 

                                   ప్రేమతో మీ పాద పద్మములకు ప్రణమిల్లుతూ  నా యొక్క విన్నపం తెలుపుకుంటున్నాను . విషయం  ఎలా తెలుపాలో అర్థం కావడం లేదు. చాలా రోజుల తరువాత మనస్సులో మాట వ్రాస్తున్నాను. నేను నీ గర్భంలో రూపు దాల్చను అంటున్న జీవం లేని జీవికి అష్ట కష్టాలు పడి ప్రాణం పోయడం అవసరమా? తల్లి దండ్రి లేక, ఇల్లు వాకిలి లేక తన వార౦టూ లేని ఓ అనాధకు తల్లి నవడం కష్టమా? అసాధ్యమా? 
                               
                     నాది అన్న పదానికి అర్ధం ఏమిటి? నేనెలా మీకు నచ్చచెప్పాలి. ప్రాణం ఎవరిలోనైన ప్రాణమే అది దైవాంశ , ఆ దివ్య శక్తిని నీది నాది అని కుచి౦చాలనుకోవడం మూర్ఖత్వ౦ కాదా. స్త్రీ పురుష వీర్యాండమందలి  తేజస్సు ఒకటే . అనుకుంటేనే నాదై  వెలిగే తేజస్సు ఎవరిదైతే నేమి?

                              తేజస్సు ఎక్కడ రూపు దాల్చినా దాన్ని పెంచి పెద్దచేసే బాధ్యత లో ఆనందం , మమకారం  నా రక్తం నా బిడ్డ అనుకునే భావన కన్నా గొప్పవి. ఇది మీకు ఎలా వివరించను ? పరాయి బిడ్డను పెంచడంలో సమస్యలు ఉండవచ్చు. అయినా అవి బిడ్డ లేని ఇంటి సూన్యత కంటే  ఎక్కువ కష్టకరము బాధాతరము            కావు కదా ?

                              ఎవరి బిడ్డనైన నీ బిడ్డగా అక్కున చేర్చుకునే విశాల హృదయం , పెల్లుబుకే మమత నీలో ఉన్నప్పుడు నీ బిడ్డనే పెంచి పెద్దచేయాలన్న తపన నీకెందుకు ? అని ప్రశ్నిస్తుంది నా మనస్సు 

                               రాజ్యాలు నేలరాలాయి , శతాబ్దాలు గతించాయి , మన ముత్తాతలేవరో మనకి సరిగ్గా తెలియదు.మనము మన తల్లి దండ్రుల బిడ్డలమే అనేందుకు ఋజువులు లేవు.చరిత్రను చూసి రాబోయే కాలాన్ని    ఊహించి మీ సంస్కారాన్ని తరచి చూసుకుని  మనది అనుకున్నది ఎన్నాళ్ళు మనదిగా ఉంటుందో  ఆలోచించండి. 

                              నా మనస్సు మీ ముందు పరిచాను మీ మనస్సు నొప్పించి ఏ పని చేయలేను కనుక  ఇంక మీ నిర్ణయమే నా నిర్ణయం.  ఇక  మీ పాద స్పర్శతో సెలవు తీసుకుంటూ.      
                                                            
                                                                              మీ  సహధర్మచారిణి