Monday 5 July 2021

Chinni kavitha

   నాకు  నచ్చిన ఓ  చిన్ని కవిత  .... ఎవరి కవిత  ?

ఆమె భవిష్యత్తు లోంచి  చక్కా వచ్చిన 

పుష్పలావిక 

విచిత్రమైన వ్యక్తి 

పూలమ్మదు 

నీ దోసిట మొగ్గలు పోసి పోతుంది 

ఒక మొగ్గ చాలు 

జీవితమంతా 

నీ హృదయంలో వికసిస్తూనే ఉంటుంది 

Saturday 3 July 2021

Annam parabrahma swaroopam

  అన్నం పరబ్రహ్మ స్వరూపం 


మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం . సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలతో కళ కళలాడే ఆవరణం . నాకు అప్పుడు ఇరవై యొక్క ఏళ్ల వయస్సు . అక్కడ టీచర్ ట్రైనింగ్ (బి. ఎడ్ ) చేస్తున్నాను . యూనివర్సిటి కాంటీన్ చాలా బావుండేది, సుమారు ముప్పై ఏళ్ల క్రిందటి మాట ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఎక్కువగా తమిళ వంట వాళ్ళు ఉండే వాళ్ళు .ప్రొద్దున్నే మూడు గంటలకంతా  స్నానాలుచేసి నామాలు దిద్దుకుని మడిగా శుచిగా వంట చేయడం మొదలు పెట్టేవాళ్ళు.  కాంటీన్ కూడా చాలా శుభ్రంగా ఉండేది. 

ప్రతి టేబుల్ మీద చిన్న చిన్న స్టీల్ బకెట్స్ లో సాంబారు చారు లాంటివి ఉంచేవారు. కౌంటర్ దగ్గరికి కంచం తీసుకువెళ్లితే అన్నం , చేతి పచ్చడి , చిన్న గిన్నెలో పెరుగు ఒక కూర ఒకసారి వడ్డించేవాళ్ళు . ఆ తరువాత చారో సాంబారో వేసుకునే వాళ్ళం . కూరలు ఎక్కువగా చెనగపప్పు కాయగూరలతో కలిపి వండే వాళ్ళు . బీట్రూట్ చెనగపప్పు , కేరట్ చెనగపప్పు అలా. రాయలసీమ కదా ఆ ప్రాంతం వంటలు ఉండటం మామూలే . 

మా రూమ్మేట్ తనతో బాటు నాకు కూడా కంచాలలో అన్నం కూరలు పట్టుకొచ్చింది . చాలా ఎక్కువ పెట్టుకొచ్చేసింది . ఇంతేంటి అంటే మళ్ళీ మళ్ళీ ఏం  వెళతాం అంది. అన్నం  ఇంకా కావాలంటే మాత్రం  కౌంటర్ దగ్గరికి మళ్ళీ వెళ్లి వేయించుకోవాలి. అందుకే ఒకేసారి అలా తెచ్చేసుకునే వాళ్ళు . 

 ఆ రోజు నా కంచంలో అన్నం మిగిలిపోయింది . అందరు చేతులు కడుక్కునే  దగ్గర ( వాష్ ఏరియ ) మిగిలిన అన్నం అంతా ఒక పెద్ద డ్రమ్ లో వేసేవాళ్ళు . రెండు మూడు అలాంటివి ఉండేవి.  రోజూ అవి  నిండిపోతుండేవి  . మిగిలిన అన్నాన్ని నేను కూడా ఒకదానిలో  వేసి కంచం కడుక్కుంటున్నాను .  

ఇంతలో ఎంత అవసరమో అంతే వేసుకోవచ్చు కదా .అంటూ ఓ స్వరం వినిపిస్తే ఎవరబ్బా అని చూసాను . మా యూనివర్సిటీ స్టూడెంట్స్ లీడర్  థర్డ్ ఇయర్ న్యాయ శాస్త్రము (LLB )   చదువుతుంది. చేయక చేయక తప్పు చేసిన దానిలా మొహం పెట్టి సారీ అక్క అన్నాను . నాకు సారీ చెప్పి ఏం లాభం అటు చూడు వేస్ట్ బిన్స్  చూపిస్తూ రోజూ ఎంత వేస్ట్ చేస్తున్నారో ఇంకోసారి అలా  చేయకు అంది . తను అన్నది నిజమే అనిపించి సరే అక్క అన్నాను కానీ భయం కూడా వేసింది కొంప దీసి రేపటి నుండి  అన్నం కూడా కూరల్లా కొంచెం కొంచెం వేయిస్తుందేమో అని .  

కాంటీన్ బయటికి వచ్చాను బయట ఒకతను వేస్ట్ బిన్లో అన్నం అంతా ఒక గోనె సంచిలో వేసుకుని తన సైకిల్ కి   ఆ సంచి కట్టుకుంటున్నాడు. అదేంటి వొట్టి తెల్ల అన్నం ఏం చేస్తాడు అనుకుని ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు అని అడిగాను. దగ్గరలో గోశాల ఉంది ఆవుల కోసం అన్నాడు. అతను మాట్లాడుతూ ఉండగానే ఒక అతను వచ్చి ఆ  సైకిల్ దగ్గర నిలబడ్డాడు . ఇతను గోనె సంచిలో నుంచి చేతితో   మూడుసార్లు అన్నం తీసి ఆ వచ్చిన మనిషి ఇచ్చిన బట్ట సంచిలో వేసి ఇచ్చాడు. వారిద్దరి మధ్య మాటలేం లేవు . అతను వెళ్ళిపోయాడు. 

రోజూ వచ్చి తన ఆకలి కోసం తీసుకు వెళ్తుంటాడు అన్నాడు . ఆ మనిషిని చూస్తే బిచ్చగాడిలా లేడు . తిరుపతి లో చాలా రకాల మనుషులు ఉంటారు భక్తులు , సాధువులు , సాధకులు , బిచ్చగాళ్ళు , పిచ్చివాళ్ళు ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు దేశ దిమ్మరులు , వెంకన్న స్వామి  తప్పు చేస్తే ఒప్పుకోడు అనే మంచివాళ్ళు ఉంటారు . అప్పటి తిరుపతి వేరు కానీ ఇప్పుడు అంతటా మోసపూరిత దోపిడీ వ్యవస్థే కదా. 

ఎవరో అతను కానీ మేము వ్యర్థమని పడేసిన అన్నము అలా గోవులకి పెట్టడమే నాకు నచ్చలేదు అలాంటిది ఆ వ్యక్తి అలా తినడానికి తీసుకు వెళ్లడం నాకు కడుపులో తిప్పేసింది . చాలా రోజుల వరకు మర్చిపోలేక పోయాను . ఇప్పటికీ ఆ సంఘటన నా కళ్ళకి కట్టినట్లు గుర్తుందంటే  ఆ ఘటన నా అచేతనను  ఎంత ప్రభావితం చేసిందో అర్థం అవుతుంది . ఆ రోజు నుంచి తినే పదార్థాలు పడేయడం అంటే నా మీద నాకే కోపం అసహ్యం , జుగుప్స , పడేసేవాళ్ళ మీద ఇర్రిటేషన్. 

ఒకసారి ఆలోచించండి ఆ మనిషి స్థానం లో మనమే ఉండాల్సి వస్తే ఆ అన్నమే తినాల్సి వస్తే ! భగవంతుడా ! మా నాన్నగారు అంటూ ఉండే వారు "వేస్ట్ నాట్ వాంట్ నాట్ " అని.  

NEVER  EVER WASTE  FOOD అని ఎప్పుడు అందరం నిశ్చయించుకుంటామో ! 

చాలా మంది తమ ఇంట్లో వాళ్లకి డబ్బు వేస్ట్ చేయొద్దు అని  చెపుతుంటారు . రంగు కాగితాల కన్నా అన్నం విలువైంది అని " అన్నం పరబ్రహ్మ స్వరూపమనిఎప్పుడు గుర్తిస్తాడో         మానవమాత్రుడు !