Monday 18 June 2012

Samaadhi lo o puvvu

                                                 నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు  రోజూ  నేను నా ఫ్రెండ్ అనురాధ ఒక ఖాళీ  స్థలంలో నుంచి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. ఒక సారి ముందు రోజు రాత్రి వానపడి నేల తడిసి ముద్ద అయ్యింది . కొన్ని చోట్ల నీళ్ళతో నిండిన చిన్న చిన్న గుంటలు. ఒక పెద్ద నీళ్ళ గుంట దగ్గర ముగ్గురు పిల్లలు నిలబడి ఏదో తిలకిస్తున్నారు . మేము కూడా కుతూ హలంతో  దగ్గరికి వెళ్లి తొంగి చూసాము . ఓ ప్రాణం లేని పసిగుడ్డు తేలుతూ ఉంది, ఆ తెల్లవారే పుట్టిందో ఏమో తెలియదు . అంత పసిగుడ్డుని చూడడం అదే  మొదటిసారి . ఇప్పటికి గుర్తుకు వచ్చినా  ఆ పసిగుడ్డు కళ్ళలో మెదులుతుంది . నాకు చాలా వింతగా , ఆశ్చర్యంగా అనిపించింది. ఆ శిశువుకి ప్రాణం లేదని నా ఫ్రెండ్ చెబితేనే తెలిసింది.

                                                    ఆ బిడ్డ తల్లి గురించి, ప్రవర్తన గురించి ఆ వయస్సులో  నా ఫ్రెండ్ చెబుతుంటే అర్ధం అయి అర్ధం కాని విషయాలు ఎన్నో నాకే  సమాధానం తెలియని, దొరకని ప్రశ్నలు మెదిలాయి అందులో తల్లి అలా బిడ్డను ఎలా ఒదిలేసిందని  ఒకటి .


                                                   ఆ విషయం మర్చిపోయాననుకున్నాను . కాని ఇన్నాళ్ళ  తరువాత పునరావృత్తం అయిన జ్ఞాపకాలలో ఆ ఘటన గమనిస్తే  ఏ పరిస్థితులలో ఆ కుటుంబం ఆ తల్లి  ఆ పని చేసారో కదా అనిపించింది. ఆ చిన్ని శరీరానికి చిన్న స్థలం ఒక అడుగున్నర స్థలం ఇవ్వలేని ఈ విశాల మానవ సమాజం , ఆ పసిగుడ్డుని అక్కున చేర్చుకునే అవకాశం అవనికి అందకపోవడం ఎవరి దురదృష్టమో. ఓ ప్రాణికి కేవలం ఓ సమాధి ఓ పువ్వు కూడా ప్రాప్తించని సహా ఉన్నత ఆధునిక సాంఘీక వ్యవస్థ లో ఐశ్వర్యమంతా  నిరుపయోగమే కదా?