Saturday 3 June 2023

Abaddam

                                                                    అబద్దం 

                               అబద్దం అంటే ఏంటో నాకు ఐదవ ఏట తెలిసింది . నాన్న చాలా బిజీ గా ఉండడం వల్ల అమ్మ అన్నీ తానే అయి మమల్ని చూసుకోవాల్సి వచ్చేది అప్పుడు తమ్ముడు నెలల పసికందు . ఒక రోజు మార్కెట్ కి వెళ్తూ అమ్మ ఒక అమ్మాయిని,  అప్పుడు ఆమె వయస్సు బహుశా పదిహేను సంవత్సరాల పైనే ఉంటుంది, తమ్ముడిని చూసుకోవడానికి ఇంట్లో ఉంచి వెళ్ళింది. ఆ అమ్మాయి తమ్ముడిని వదిలి మా ఇంటి పెరటి గోడ ఎక్కి నడవడం మొదలు పెట్టింది .  నన్ను కూడా ఎక్కమంది నేను తన వెనకాల గోడెక్కి నడుస్తున్నాను . దూరం నుంచి తెలిసిన వాళ్ళు మా ఇద్దరినీ చూసి మా అమ్మతో చెప్పారు . అమ్మ ఆ అమ్మాయిని గట్టిగా అడుగుతుంటే మేమస్సలు గోడనే ఎక్కలేదు అని చెప్పింది . అమ్మ నువ్వు అబద్దం చెప్తున్నావు అంది . అదిగో అప్పుడు మొదటిసారి విన్నా "అబద్దం" అనే పదం. 

                            గోడ ఎక్కి నడిచినా ఎక్కలేదు అని ఆ అక్క ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు . చాలా సునాయాసంగా ఎంతో మామూలుగా జరిగిన దానిలానే చెప్పేసింది. ఇన్ని సంవత్సరాలైనా  ఆ "అబద్దం" నేను మర్చిపోలేదు. 

                        అందంగా అబద్దం చెప్పడం కూడా నాకు రాని కళే అని చెప్పొచ్చు . కొందరు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేదంతా అబద్దమే అని తెలుస్తుంది కానీ వింటాము నమ్ముతాము అదే మాయ.  

                   మాయ మన చుట్టూ ఎన్నో అబద్దాలను పేర్చుకుంటూ పోతుంది వాటిని ఛేదించుకుంటూ ఒక పద్మ వ్యూహాన్ని దాటుకుంటూ నిజాన్ని చేరుకోగలగాలి. ఆ తరువాత జీవితంలో ఎన్నో అబద్దాలను చవి చూసాను . ఎంతో ఆశ్చర్యం వేసేది . ఎన్ని రకాల అబద్దాలు వాటికి ఎన్ని కారణాలు . భయం, ప్రేమ, హాస్యం, అవసరం, గుర్తింపు, అవమానం, అసూయ,సరదా, బాధపెట్టడం కోసం, బాధపెట్టడం ఇష్టం లేక, జాలి, మోసం, ద్వేషం ఇలా ఎన్నో ఎన్నెనో కారణాలు. 

                         అనురాధ నా క్లాస్ అమ్మాయి, స్కూల్ అయ్యాక  ఒక ఐదు మందిమి  నడిచి వెళ్ళేవాళ్ళం ఒక రోజు ఒక ఇంటి ముందు ఆగి మా అత్తమ్మ ఇల్లు, తలుపు కొట్టి పిలు ఓ విషయం చెప్పాలి అంది ఓ నాలుగు మెట్లు ఉంటాయి ఆ  ఇంటి ముందు తాను ఎక్కలేను TIRED గా ఉంది అంది సరే అని నేను మెట్లు ఎక్కి తలుపు కొట్టాను ఒక పెద్దావిడ తలుపు తీసి ఏంటి అంది వినక్కి తిరిగి  చూస్తే అందరు దూరంగా పరుగెత్తు కుంటూ నవ్వుకుంటూ వచ్చేయి అని నాకు సైగ చేస్తూ ... నేను గబ గబా మెట్లు దిగుతూ  ఆవిడ  తిట్ల దండకం వింటూ  పరుగు లంఘించుకున్నా. వీళ్ళ వినోదం  కోసం పెద్దావిడని కష్ట పెట్టాము 

                             నమ్మించడం ఇంటెలిజెంట్ ఆక్ట్, నమ్మడం FOOLISHNESS అని మనిషి అనుకునేటంత  కాలం అబద్దం గెలుస్తూనే ఉంటుంది 

                                       అకారణంగా ఏదో  గాలివాటుగా అబద్దం చెప్పడం అన్నిటి కంటే విచిత్రం వీరినే సైకాలజీ లో "Pathetic liars " అంటారు. అనవసరంగా  "Without any motive they lie just like that . "

                       నూరు అబద్దాలు చెప్పి అయినా ఒక  పెళ్లి

 చేయమన్నారు అది ఒకప్పటి సంగతి ఇప్పుడు ఎన్ని

 అబద్ధాలైనా   చెప్పి విడాకులు తీసుకుంటున్నారు 

                        ధర్మరాజు అశ్వథామ హతః కుంజరః అంటే 

కుంజరః అనే మాటను వినకుండా భేరి నాదం తో

 కప్పిపెట్టి    ఓ ద్రోణాచార్యుణ్ణే మట్టుపెట్టిన వైనఁ ,

 ఎల్లప్పుడూ సత్యమే పలికే వ్యక్తి దాచే నిజానికి, ఆడే

  అబద్ధానికి ఉన్న శక్తిని తెలుపుతుంది. తెలివిగా సగం

 నిజాన్ని ఆయుధంగా వాడిన కృష్ణుని ధర్మయుద్ధం

 కలియుగ ఆరంభానికి నాంది పలికిందేమో . 

                           అందుకే కలియుగం లో  అబద్దానికే ఎక్కువ

 విలువ . అబద్దాన్ని బ్యాంకు లో  డబ్బులా జాగ్రత్తగా

 వాడుకోవాలి . అనవసరంగా వృథా చేసుకోకూడదు . 

                           నిజమే ఎందుకు చెప్పాలి అని అడిగే

 వాళ్ళకి  ఇది ఓ దృక్పథం కావాలి .  


                          అస్సలు ఇదంతా నేను రాయడానికి కారణమైన సంఘటన....  ఒక inspection కమిటీ member ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ఎంత దూరం లో ఉంది అని అడిగారు.   డయల్ 101 కాలం లో  పోలీస్ స్టేషన్  ఎక్కడ ఉన్నా హెల్ప్ ought to రీచ్ us కదా . నాకు తెలియదు అని నిజమే చెప్పాను . ఏదో ఒక దూరం కొలత చెప్పొచ్చుగా అన్నాడు అతను , దాని బదులు నీకు అది కూడా తెలియదా అన్నా బావుండును. ఎదురుగుండా కూర్చున్న చైర్మన్ గారు అబద్దం చెప్పడం కూడా రాదు అని సణుక్కోవడం హైలైట్ . అబద్దం చెప్పడం ఓ పెద్ద సర్టిఫైడ్ qualification అయినట్లు . ఫ్యూచర్ లో lying స్కిల్స్....  హౌ to lie elegantly  అనే కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారేమో . 


                                ఎప్పుడూ  అబద్దం ఆడే వాడి మాటకు

 విలువ ఉండదు కొందరి వ్యక్తుల పేరులోనే సత్యం

 ఉంటుంది కానీ అన్నీ  అసత్యం ఒలికే పలుకులే...  అవి

 అసత్యాలు అని మనకి తెలిసే లోగా జరగాల్సిన అనర్థాలు

 జరిగిపోతాయి. 

                                 అందుకే పూర్వ కాలం అబద్దాలు

 ఆడేవాడికి తథాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అనే

 వాళ్ళు. అదే వాళ్లకి పెద్ద శిక్ష . 

                                                               

                                 నిజాన్ని కప్పేసే శక్తి సమాజానికి

 ఉండడం వాస్తవమే అయినా ఆ అబద్దం ఏదో ఒక రోజు

 తమ సమాజాన్నే నివురుగప్పిన నిజమై కాల్చేస్తుందని 

తెలిసిన నాడు మనిషి  సత్యం వద  అని ఆచరిస్తాడు


              నాన్న నేర్పిన ఒక శ్లోకం 

ప్రియంచ  బృయాత్ సత్యం బృయాత్ 

అప్రియం నాబ్రూయాత్  అసత్యం నాబ్రూయాత్ 

ప్రియంచ అసత్య అబ్రుయాత్ 

  సత్యం అప్రియఞ్చ నభృయాత్ 


ప్రియమైనది పలుకు , నిజం పలుకు 

అప్రియమైనది  పలుకకు ,  నిజం కానిది పలుకకు , 

ప్రియమైన అసత్యం పలుకకు , 

అప్రియమైన సత్యాన్ని పలుకకు . 


                             సత్యమేవ జయతే