Saturday 4 December 2021

ne chadivina o saadrusya kavitha ... 2014


అతనితో నడిచే సాయంత్రం 


మేమిద్దరం 'ఈవెనింగ్ వాక్' కని 

 ఇంటి బైటకి అడుగు పెడతామా

 అప్పటిదాకా ఎక్కడున్నాడో  తెలియని అతనిలోని

 మనసైన స్నేహితుడు

 హఠాత్తుగా ఎదుట నిలుస్తాడు


 ఎప్పటిదో ఒక చిరపరిచిత హాసం 

అతని ముఖం మీద

 పునః ప్రత్యక్షమౌతుంది


  ఉదయం నుంచి నా ఉనికి పట్టించుకోని అతను 

 నాకు సహా ప్రయాణికుడు అయ్యే 

 ఆ గంట

 కాలచక్రం లోంచి గభాలున తప్పుకుని 

జలపాతమై దుముకుతుంది 


అతని మాటల్లో ఆవేల్టి స్టాక్ మార్కెట్ లాభ నష్టాలో 

ఆఫీసు బాదరబందీ కబుర్లో 

చిత్రంగా 

నా చెవులకి వేళ్ళాడే అందాల జూకాలవుతాయి  


నేను వినిపించే పొద్దస్తమానపు పసికూనల

 ముద్దుమాటలు 

చెవినొగ్గి  వినే అతని మీసాల చాటున 

వేల చంద్రహాసాలై  తళుక్కున మెరుస్తాయి 


మేమలా వీధి దాటి మలుపు దాటి

 బడి దాటి బాల వనం దాటి

బాట వెంట నడుస్తుంటామా 


ప్రతి ఇంటి బయటా విరబూసిన పూలమొక్కలు, చిన్న పూల పొదలు 

దారిపొడుగునా 

చిరుచీకట్లో మెరిసే నక్షత్రాల కళ్ళేసుకుని 

వీధి చివరంటా మా కోసమే తొంగి చూస్తుంటాయి 


 అడుగడుగునా సాయంత్రానికి   విరజిమ్మే నీటి బుగ్గలు

 కృత్రిమ వానజల్లులై 

సాయంత్రపు ఏటవాలు వెలుతుర్లో ఇంద్రధనస్సులై మెరిసి 

గుండ్రటి నీటిరెక్కల తుమ్మెదలై గిరికీలు కొడతాయి


ఇద్దరం చెప్పుకునే కులాసా కబుర్లు 

రోజల్లా యంత్రాల ముందు వేడెక్కిన మస్తకాలకి 

పని ఒత్తిళ్లలో   అలసి సొలసిన శరీరాలకి 

సేదతీర్చే చలివేంద్రాలవుతాయి 


మా లోపలి బాల్య స్నేహితులు

 మాతో చెట్టా పట్టాలేసుకొని నవ్వుతూ తుళ్ళుతూ  నడిచే 

సాయంత్రపు వ్యాయామం 

ప్రతిరోజూ 

వ్యాహ్యాళిగా మారుతుంది 


రెండు యంత్రాలైన మమల్ని 

ఇద్దరు మనుషులుగా మార్చే 

సాయంత్రపు నడకలో 

మూడు మైళ్ళు  మూడు అడుగులవుతాయి 


ఒక్కళ్లనొకళ్ళం మర్చిపోయిన 

మమల్ని 

రోజూ నిత్య నూతనంగా కలిపే 

ఏడడుగులవుతాయి . 

                                                   కె . గీత