Monday 7 November 2011

Maro Kavitha

 నేను గతంలో చదివి భద్రపరచుకున్న మరో కవితాచిత్రం 

                           నేను - నువ్వు 
                         
     ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినప్పుడు  
మేమిద్దరం చెరోదృవం వైపు విసిరేయబడతాము 
ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది 
చేయి చాచితే అందే ఆమె దూరం 
మనస్సులో యోజనాలై విస్తరించుకుంటుంది 

ఉల్లిపొరై మా మధ్య లేచిన భేదభావానికి 
నా అహం ఉక్కు పూత పూసేందుకు  నడుం బిగిస్తుంది 
మౌనంగా  మా మధ్య చెలియలి కట్టలా పడుకుని ఉన్న పాపకు  
ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగసిపడుతుంది 
నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకుంటూ 
ఆమె కత్తి  వాదర వెనుక గయ్యాళితనాన్ని కొలుస్తుంటుంది 

  టైమ్ కి  డ్యూటీకి కొచ్చి తట్టి సైగ చేసే నిద్రను 
మెలకువ కసురుకొంటు౦ది  
  ఎ౦తకూ నిద్రలేవని ఆమెలో దాసిత్వాన్ని 
  నాలోని పురుషత్వం శంకిస్తుంటుంది 
  అప్పుడు అభిప్రాయం కాదు సమస్య 
 అది విరిగిన క్షణాలు మెదడులో వేరుపురుగులవ్వడం 

   ఇప్పుడు - భేద భావం కాదు ప్రశ్న 
    ఆమె అబలత్వం తీవై సాగి 
    చివురుల అరచేతుల్తో నా అహాన్ని స"మర్ధిస్తూ  " 
                        నా పైకి ఎగబాకలేదనే 
    క్షణ క్షణానికి ఆమె మౌనం 
                        మీద వేయించబడుతోన్న 
                                                     నా అహం  
   బేలగా మారి బీటలు వారెందుకు సిద్ధమౌతుంది 
 ఆమె చలిగాలి అలై ఒంటరితనాన్ని స్పర్శిస్తే  
    జలదరించి వర్షించాలని ఉంటుంది 

       మనో గవాక్షాల నుంచి దూకి వచ్చిన చంద్రబింబం 
     కన్నీటి బిందువై మా మధ్య కేర్ మన్నప్పుడు 
       ఆమె లోని మాతృత్వం పాపకేసి నదిలా కదలి
     అసంకల్పితంగా నన్ను ఆడతనమై తాకుతుందా 
           నేనే నీటి బుడగనై  పేలిపోతాను 
      ఎర్రనీటి  ఏటినై ఉరకలెత్తుతాను 
           ఆమెను నా గుండెల సుడిగుండాల్లో పసిపాపలా తిప్పుతాను 
       నేనే ఆమెనై  అబలనై పసిపాపనై గారాలు పోతాను 

                                                          సన్నపురెడ్డి   వెంకటరామిరెడ్డి            
     
       



             

No comments:

Post a Comment