Behaviour Modification లో Token Economy చదువుతుంటే నా ఫ్రెండ్ విన్నిచెప్పిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఇది చైల్డ్ లేబర్ యాక్ట్ అమలులోకి రాక ముందు విషయం .విన్నివాళ్ళు వాళ్ళ ఊరి దొరలు, ఒక అమ్మాయి ఏ పదేళ్ళు ఉంటాయేమో ఇంట్లో పని కోసం వరంగల్ కి తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి అనాగరికము, అపరిశుభ్రమైన వాతావరణం నుంచి వచ్చింది. విన్ని ఇంటి తీరుతెన్నులు చిన్నపిల్ల అవటం మూలాన చాల త్వరగానే నేర్చుకుంది . వీళ్ళ ఒద్దిక, పరిశుభ్రత అన్నీఅలవరుచుకుని కొన్ని రోజులకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తన అమ్మ , అయ్య పనిలోకి వెళితే తన గుడిసెని చక్కగా శుభ్రపరచి౦ది. కుండలు ఒకదానిపై ఒకటి పేర్చింది. గుడిశెని మొత్తం ఊడ్చి చక్కగా తీర్చిదిద్దింది.
పని నుండి మధ్యాహ్నం ఇంటికి అదే గుడిసెకి వచ్చిన వాళ్ళ అమ్మకి గుడిసె శుభ్రత కనిపించలేదు.తనకి కావాల్సిన వస్తువు ఉన్నకుండని ఆదరా బాదరాగా వెతికి అన్ని కుండలు చెల్లా చెదరు చేసి , వస్తువు దొరికిన తరువాత, తనకు కావలసినవి దొరకడానికి అంతసేపు పట్టిందని దానికి తన కూతురు చేసిన నిర్వాకం కారణం అని తన కూతుర్ని నాలుగు చెడామడా తిట్టి , కొట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి తను చేసిన తప్పేంటో అర్ధంకాక నిలువు గుడ్లేసుకుని నిలుచుండిపోయి౦ది.
సమాజంలో మనుషుల ప్రవర్తనలో మార్పు రావాలంటే అందుకు తగిన పరిస్థితులు అన్ని చోట్ల కల్పించబడకపోతే ఆ మార్పు సుస్థిరబడనట్లే. ఒక సంస్థ నాలుగు గోడల మధ్య ఏర్పడే మార్పుకి జరిగే అభ్యసనానికి బైట ప్రపంచం గుర్తింపుని , నీడని అందించి పెంపొంది౦చకపోతే ఆ అభ్యసనం నిరుపయోగమౌతుంది. అలాగే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువలకి ఆలంబన దొరకకపోతే అవి ఆవిరైపోతాయి. అందుకే నేటి ప్రపంచంలో నేర్చుకున్న దానికి, అమలుపరిచే వాటికి అంత వ్యత్యాసం . నేర్పేవారికి నేర్చుకునే వారికి మధ్య అంతటి అగాధం. నేర్చుకోలేని వాళ్ళు ఎన్నటికి నేర్పేవాళ్ళు కాలేరు అని నా అభిప్రాయం.
No comments:
Post a Comment