ఎప్పుడు చదివానో గుర్తులేదు, ఎందులో చదివానో గుర్తులేదు కాని అర్థం అయి అర్థం కాని వయస్సులో ఈ కవిత ఎందుకో తెలియదు నాకు చాలా నచ్చింది . వ్రాసిన వారి పేరు తప్ప ఏమి తెలియవు కాని తన ఆర్తిని మనస్సుకి హత్తుకునేలా చాలా బాగా రచించాడనిపించింది . అందమైన సరళ పదాలలో సంక్షిప్తంగా సంపూర్ణ దృశ్యంలో తన బాధని వ్యక్తీకరించాడు. ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా వ్రాసుకుని మరీ పదిలంగా దాచుకున్నాను. అది మీ అందరితో పంచుకోవడం కోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
జీవరసాయనం
జత కోసం కరువ్వాచి కలసినప్పుడల్లా
త్వమేవాహం వెఱెక్కించి
నన్ను పారేస్తున్నావు : నిన్ను పట్టుకెళ్తున్నావు
చుట్టూ సూన్యం
నన్ను నాకిచ్చెయ్యమంటూ వినపడని కేక
దీనంగా విన్నపంగా ------------
అలసి మౌనం
నేస్తం తాపాన్ని కాదు హాయినివ్వు
చీకటి లోయలోకి గెంటకు
వెలుగు శిఖరంపై నిలుపు
జట్టుగా వెలుగు నీడలలో
పయనిస్తున్న వేళ
నన్ను ఒంటరిని చేసి నీవు ఒంటరివి కాకు
ఎండమావుల లోకమంతా తిరిగి తిరిగి వస్తే
చిరనిరీక్షణలో దుర్భరమైన ఏకాకితనం
సర్వస్వాన్ని హరి౦చిన తరువాత
సజీవ శిథిలే౦ద్రియాలు
పలకాలనుకున్న స్వాగతం
గ్రహించే శక్తి నీకు
పలికే శక్తి నాకు
కరువు కాక ముందే గ్రహించు
చెలిమంటే పరిహాసమూ
దాగుడు మూతా
పిడికిలి బిగి౦పూ
శాసనమూ కాదని
చెలిమంటే
వ్రతమని, తపస్సని
దివ్యానుభవమని
మనిషినీ మనసునూ
నిత్య యౌవ్వనంలో
హాయిగా........... తాజాగా నిలిపే
జీవరసాయనమని
- కొమ్మన రాధా కృష్ణ
No comments:
Post a Comment