ప్రియమైన శ్రీ వారికి,
ప్రేమతో మీ పాద పద్మములకు ప్రణమిల్లుతూ నా యొక్క విన్నపం తెలుపుకుంటున్నాను . విషయం ఎలా తెలుపాలో అర్థం కావడం లేదు. చాలా రోజుల తరువాత మనస్సులో మాట వ్రాస్తున్నాను. నేను నీ గర్భంలో రూపు దాల్చను అంటున్న జీవం లేని జీవికి అష్ట కష్టాలు పడి ప్రాణం పోయడం అవసరమా? తల్లి దండ్రి లేక, ఇల్లు వాకిలి లేక తన వార౦టూ లేని ఓ అనాధకు తల్లి నవడం కష్టమా? అసాధ్యమా?
నాది అన్న పదానికి అర్ధం ఏమిటి? నేనెలా మీకు నచ్చచెప్పాలి. ప్రాణం ఎవరిలోనైన ప్రాణమే అది దైవాంశ , ఆ దివ్య శక్తిని నీది నాది అని కుచి౦చాలనుకోవడం మూర్ఖత్వ౦ కాదా. స్త్రీ పురుష వీర్యాండమందలి తేజస్సు ఒకటే . అనుకుంటేనే నాదై వెలిగే తేజస్సు ఎవరిదైతే నేమి?
తేజస్సు ఎక్కడ రూపు దాల్చినా దాన్ని పెంచి పెద్దచేసే బాధ్యత లో ఆనందం , మమకారం నా రక్తం నా బిడ్డ అనుకునే భావన కన్నా గొప్పవి. ఇది మీకు ఎలా వివరించను ? పరాయి బిడ్డను పెంచడంలో సమస్యలు ఉండవచ్చు. అయినా అవి బిడ్డ లేని ఇంటి సూన్యత కంటే ఎక్కువ కష్టకరము బాధాతరము కావు కదా ?
ఎవరి బిడ్డనైన నీ బిడ్డగా అక్కున చేర్చుకునే విశాల హృదయం , పెల్లుబుకే మమత నీలో ఉన్నప్పుడు నీ బిడ్డనే పెంచి పెద్దచేయాలన్న తపన నీకెందుకు ? అని ప్రశ్నిస్తుంది నా మనస్సు
రాజ్యాలు నేలరాలాయి , శతాబ్దాలు గతించాయి , మన ముత్తాతలేవరో మనకి సరిగ్గా తెలియదు.మనము మన తల్లి దండ్రుల బిడ్డలమే అనేందుకు ఋజువులు లేవు.చరిత్రను చూసి రాబోయే కాలాన్ని ఊహించి మీ సంస్కారాన్ని తరచి చూసుకుని మనది అనుకున్నది ఎన్నాళ్ళు మనదిగా ఉంటుందో ఆలోచించండి.
నా మనస్సు మీ ముందు పరిచాను మీ మనస్సు నొప్పించి ఏ పని చేయలేను కనుక ఇంక మీ నిర్ణయమే నా నిర్ణయం. ఇక మీ పాద స్పర్శతో సెలవు తీసుకుంటూ.
మీ సహధర్మచారిణి
మీ సహధర్మచారిణి
No comments:
Post a Comment